ప్రపంచంలో త్రీ ఇడియట్స్ తర్వాత ‘దూకుడు’దే రెండోస్థానం....

మహేష్‌బాబు మంచి దూకుడు మీద ఉన్నారు. ‘దూకుడు’ సంచలన విజయం ఆయనలో నూతనోత్తేజాన్ని రగిల్చింది. చాలా రోజుల తర్వాత ఆయన మీడియాతో మనసు విప్పి మాట్లాడారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘దూకుడు’ సక్సెస్‌మీట్‌లో మహేష్ సందడి చేశారు. ముంబయిలో ‘ద బిజినెస్‌మ్యాన్’ షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్న మహేష్, ఈ సక్సెస్ మీట్ కోసమే హైదరాబాద్ వచ్చారు. ‘దూకుడు’ విజయం గురించి సూపర్‌స్టార్ కృష్ణ భావోద్వేగంగా ప్రసంగిస్తుంటే మెరిసే కళ్లతో తండ్రి సంతోషాన్ని తనివితీరా ఆస్వాదించారు. ఈ సందర్భంగా మీడియాతో తన అనుభూతుల్ని పంచుకున్నారు మహేష్.

ఈ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు?

ఇంకా పూర్తిగా ఈ సక్సెస్‌ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఈ సినిమా హిట్ అవుతుందని అనుకున్నాను కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. ఇది యూనివర్శల్ స్క్రిప్ట్. నాకు బాగా నచ్చిన స్క్రిప్ట్. ఇందులో అన్ని అంశాలు ఉన్నాయి. నా కెరీర్‌లోనే ‘దూకుడు’ బెస్ట్ స్క్రిప్ట్‌గా చెప్పగలుగుతాను. అన్ని ఎమోషన్లు పలికించడానికి ఈ కేరక్టర్ నాకు అవకాశం కల్పించింది.

ఒక్క పాత్రలో అన్ని ఎమోషన్లు పలికించడం కష్టం అనిపించలేదా?

అనిపించలేదు. నాకిది నచ్చిన కథ. దాంతో ఇష్టంగా చేశాను. మొదటి మూడురోజులు మీరన్నట్లు కాస్త కష్టం అనిపించినా తర్వాత ఎంజాయ్ చేస్తూ ఈ కేరక్టర్ చేశాను. తండ్రీ కొడుకుల మధ్య ఉండే అనుబంధం ఒకపక్క, పోలీసుగా ఒకపక్క, ఎంటర్‌టైన్‌మెంట్ వేలో మరో పక్క... ఇలా విభిన్నమైన యాంగిల్స్ ఉన్నాయి ఆ పాత్రలో. ఒక విషయంలో మాత్రం ‘దూకుడు’ నాకు చాలా హెల్ప్ చేసింది. మొన్నటిదాకా ‘పోకిరి’ చట్రంలో ఇరుక్కుపోయాన్నేను. ఆ ఇమేజ్ నుంచి బయటపడేసిన చిత్రం ‘దూకుడు’. ‘పోకిరి’ రికార్డుని బ్రేక్ చేయడానికి నాకు చాలా రోజులు పట్టింది. అలాంటి పరిస్థితి మళ్లీ రాదని అనుకుంటున్నాను. ఎందుకంటే, ఒక్క పాత్రలో ఇన్ని షేడ్స్ పోషించాను కాబట్టి.. ఇక ఎలాంటి పాత్ర అయినా పోషించగలనన్న నమ్మకం నాకు ‘దూకుడు’ కలిగించింది.

మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్?


నాన్నగారు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పడమే బెస్ట్ కాంప్లిమెంట్. ఆయన 80 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పారు. పూరి జగన్నాథ్ అయితే బ్రహ్మానందంకి ధీటుగా కామెడీ చేశావన్నాడు. అలాగే రాజమౌళి కూడా. ఇంతమంది కాంప్లిమెంట్లు పొందడం చాలా ఆనందంగా ఉంది.

సినిమాలో మీ పాత్ర కాకుండా మీకు నచ్చిన మరో పాత్ర ఏమిటి?
ప్రకాష్‌రాజ్ కేరక్టర్. శ్రీను వైట్ల దాన్ని చాలా కొత్తగా డిజైన్ చేశాడు.

ఫస్ట్ టైమ్‌లో ఎమ్మెల్యే గెటప్‌లో కనిపించడం ఎలాంటి అనుభూతినిచ్చింది?
కొత్తగా ఉంది. సినిమాకి హైలైట్ అవుతుందని అందరం అనుకున్నాం. నా మెడలో పులిగోరు, వైట్ అండ్ వైట్ డ్రస్ అందరికీ నచ్చింది. నాక్కూడా బాగా నచ్చింది.

విదేశాల్లో కూడా ఈ సినిమా సక్సెస్ అవ్వడంపట్ల మీ ఫీలింగ్?

‘3 ఇడియట్స్’ ఓవర్‌సీస్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో ఉంటే.. నంబర్ 2 ప్లేస్‌లో ‘దూకుడు’ ఉంది. పది కోట్లకు పైనే అక్కడ వసూలు చేసింది ఈ సినిమా. మన దగ్గర నైజాం కలెక్షన్లతో సమానంగా ఓవర్‌సీస్‌లో వసూలు చేసింది. మన తెలుగువారందరూ గర్వపడాల్సిన విషయం.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కేరక్టరైజేషన్ ఎలా ఉంటుంది?
కేరక్టరైజేషన్ గురించి ఇప్పుడే చెప్పకూడదు. అయితే వెంకటేష్‌గారితో చేయడం మాత్రం ఆనందంగా ఉంది. ఆయనది ఫ్రెండ్లీ నేచర్. ఇందులో మేమిద్దరం అన్నదమ్ములుగా నటిస్తున్నాం. శ్రీకాంత్ అడ్డాల చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. రేపు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను.